సంక్రాంతి తరువాత స్మార్ట్ చిప్‌తో కొత్త తెల్ల రేషన్ కార్డులు మంజూరు : మంత్రి ఉత్తమ్

సంక్రాంతి తరువాత కొత్త తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు పౌర సరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. దాదాపు 10 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని, దీని ద్వారా 31 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ కారణంగా ప్రభుత్వంపై ఏటా రూ.956 కోట్లు అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు.

రేషన్ కార్డుల జారీపై శాసన మండలిలో సభ్యులు కోదండరాం మరియు మీర్జా రియాజుల్ హసన్ అడిగిన ప్రశ్నకు మంత్రి పై విధంగా సమాధానమిచ్చారు.

కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డు లు:
కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేను ఆధారంగా తీసుకుంటామని చెప్పారు. తెల్ల రేషన్ కార్డులకు చిప్ జోడించి స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో అదనపు పేర్ల నమోదుకు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు రావడం జరిగిందని, గత పదేళ్లుగా వచ్చిన 18 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని మంత్రి తెలిపారు.

ఉపసంఘ సూచనలు:
రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియలో సుప్రీం కోర్టు సక్సేనా కమిటీ సిఫారసులు మరియు ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రతినిధుల సూచనలు పరిగణనలోకి తీసుకున్నామని వెల్లడించారు. ఉపసంఘం అన్ని అంశాలను పరిశీలించి, కొత్త రేషన్ కార్డుల అర్హతా ప్రమాణాలను రూపొందించి కేబినెట్‌కు నివేదిక అందించనున్నట్లు తెలిపారు.

దొడ్డుబియ్యం సమస్య:
రేషన్ షాపుల్లో దొడ్డుబియ్యం పక్కదారి పడుతోందని మంత్రి అంగీకరించారు. సన్నబియ్యం మాత్రమే సరఫరా చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అలాగే నిత్యావసర వస్తువుల పంపిణీ గురించి ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదని తెలిపారు.

రద్దు అయిన కార్డులు:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 91,68,231 రేషన్ కార్డులు ఉండగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2,46,324 కార్డులు రద్దు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 89,21,907 తెల్ల కార్డులు ఉండగా, లబ్ధిదారుల సంఖ్య 2.7 కోట్లు అని వివరించారు.

గత ప్రభుత్వం కాలంలో మంజూరు:
2016-2023 మధ్య 20.69 లక్షల లబ్ధిదారులకు 6,47,479 ఆహార భద్రతా కార్డులు మంజూరు చేయగా, అదే సమయంలో 5,98,000 కార్డులు తొలగించారని తెలిపారు. గత పదేళ్లలో మంజూరు చేసిన తెల్ల రేషన్ కార్డులు 49 వేలు మాత్రమేనని, వీటి లబ్ధిదారులు 86 వేల మంది ఉన్నారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *